: మాపై ఒత్తిడి పెంచితే ఏం చేయగలం: చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్న బ్యాంకర్లు
రిజర్వ్ బ్యాంకు నుంచి నగదు అందని పరిస్థితుల్లో తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా తాము ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని వుందని బ్యాంకర్లు అంటున్నారు. నోట్ల రద్దుతో ఇప్పటికే తమపై ఒత్తిడి పెరిగిందని, అదనపు పని గంటలు శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నా, అకారణంగా తమను ప్రజలు ఆడిపోసుకుంటున్నారని పలు బ్యాంకు మేనేజర్లు వాపోయారు. ప్రజలతో పాటు, అన్నీ తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం సైతం తమపైనే బాధ్యత వేయాలని చూస్తోందని అంటున్నారు. తాము నిరంతరమూ శ్రమిస్తున్నా, ప్రజలు సంతృప్తి చెందకపోవడానికి కారణం.. చాలినంత నగదు లభ్యత లేకపోవడమేనని తెలిపారు. ప్రజలకు నగదు ఇవ్వడంలో తాము అలసత్వం వహిస్తున్నామని వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. కాగా, ఇటీవలి బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ఇబ్బందులు పెరిగాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలను బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సైతం తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఇక నేడు పెద్దమొత్తంలో కరెన్సీ వచ్చినా, అదింకా బ్యాంకులకు చేరలేదని సమాచారం. ఆ నగదు మారుమూల బ్యాంకులకు చేరాలంటే, సాయంత్రం అవుతుందని, రేపు మాత్రమే ఆ నగదును పంచగలమని బ్యాంకర్లు చెబుతున్నారు.