: సినిమా హాల్స్ లో మాత్రమే... కోర్టుల్లో 'జనగణమన' తప్పనిసరి చేయలేం: స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
సినిమా థియేటర్లలో జాతీయగీతాలాపన తప్పనిసరి అంటూ రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం, అదే జాతీయ గీతాన్ని కోర్టుల్లో ఆలపించడాన్ని తప్పనిసరి చేయలేమని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 'జనగణమన' పాడేలా ఆదేశాలు ఇవ్వాలని అశ్వినీ ఉపాధ్యాయ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం, జాతీయగీతం పాడాలన్న ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. పిటిషన్ సమగ్రంగా లేదని అభిప్రాయపడుతూ, అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోర్టు కోరగా, ప్రభుత్వం తరఫున సైతం అభిప్రాయాన్ని వెల్లడించలేమని, ధర్మాసనమే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, సినిమా హాల్స్ లో చిత్రం ప్రారంభానికి ముందు జాతీయగీతం వినిపించాలని, ఆ సమయంలో అందరూ లేచి నిలబడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.