: ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమార్తెపై దుండగుల దాడి.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ కుమార్తె లతిక దీక్షిత్‌పై పలువురు దుండగులు దాడి చేయడం ఇటీవల కలకలం రేపింది. ఈ దాడికి దిగిన ముగ్గురిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తతో విభేదాలు వచ్చిన కారణంగా హైలే రోడ్డులోని ఉపాసన అపార్ట్‌మెంట్స్‌లో లతిక దీక్షిత్ గత కొంతకాలంగా నివసిస్తున్నారు. సదరు అపార్ట్‌మెంట్స్‌లోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు ఆమెపై ఈ దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సభ్యుడు శశికాంత్ శర్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భర్తపై లతిక దీక్షిత్ గృహహింస చట్టం కింద కేసు పెట్టిన నేపథ్యంలో బెంగళూరులో ఉంటున్న ఆమె భర్త ఇమ్రాన్‌ని ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనుషులే లతికపై దాడి చేసి ఉంటారని శశికాంత్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.