: ఏంటీ ఫ్రీ ఆఫర్లు?... జియోపై టెలికం రెగ్యులేటరీ కన్ను
తొలుత డిసెంబర్ 31 వరకూ డేటా, కాల్స్ ఉచిత సేవలను అందిస్తామని ప్రకటించిన రిలయన్స్ జియో, ఇప్పుడు అదే ఫ్రీ ఆఫర్ ను మార్చి 31 వరకూ పొడిగించడంపై టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా టెలికం ఆపరేటర్ల నుంచి వస్తున్న ఒత్తిడితో, అసలు ఇంత ఫ్రీగా డేటాను, కాల్స్ ను ఎలా ఇవ్వగలుగుతారో పరిశీలించాలని ట్రాయ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 1 జీబీ డేటాను ఎయిర్ టెల్ నెల రోజులకు రూ. 259పై విక్రయిస్తున్న సమయంలో ఆరు నెలల పాటు ఉచిత డేటా ఇవ్వడమంటే రిలయన్స్ జియో ఒక్కో కస్టమర్ పై కొన్ని వేల రూపాయలను వెచ్చిస్తున్నట్టే లెక్క. కాగా, నిన్న ముఖేష్ నోటి వెంట వచ్చిన కొత్త ఆఫర్లను నిశితంగా పరిశీలిస్తున్నామని ట్రాయ్ అధికారి ఒకరు తెలిపారు. ఆఫర్లు నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అన్న విషయాన్ని ట్రాయ్ అధికారులు పరిశీలించనున్నారు. కాగా, డిసెంబర్ 31 వరకూ ఆఫర్లకు అనుమతి ఇస్తూ, గతంలో ట్రాయ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.