: రూ.40 వేల కోట్లు వేస్తే.. రూ.1200 కోట్లు ఇచ్చారు.. డిపాజిట్లకే పరిమితమవుతున్న బ్యాంకులు
పెద్దనోట్ల రద్దు తర్వాత నిన్నమొన్నటి వరకు బిజీగా మారిపోయిన బ్యాంకులకు నేడు పనిలేకుండా పోయింది. కేవలం డిపాజిట్లకే పరిమితమవుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో రూ.40 వేల కోట్లు బ్యాంకుల్లో జమ అయింది. అయితే రిజర్వ్ బ్యాంకు నుంచి మాత్రం బ్యాంకులకు అందింది మాత్రం రూ.1200 కోట్లే. ఫలితంగా నగదుకు కటకట ఏర్పడింది. గత నెలాఖరు నాటికి తెలంగాణలో రూ.వేల కోట్ల వ్యాపారాలు ఆగిపోయాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత నెలలో గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో రూ.11 వేల కోట్లు జమకాగా బ్యాంకులు పంపిణీ చేసింది మాత్రం రూ.500 కోట్లే. ఈ మొత్తం కూడా నోట్ల రద్దు తర్వాత మొదటి మూడు రోజులు ఇచ్చిందే కావడం గమనార్హం. గతనెల 15 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు నుంచి పైసా కూడా అందలేదు. దీంతో ఎవరైనా వచ్చి డబ్బులు డిపాజిట్ చేస్తే తీసుకోవడం తప్ప బ్యాంకులకు వేరే పనిలేకుండా పోయింది. నగదు విత్ డ్రా కోసం వస్తున్న వారికి ఏం చెప్పాలో తెలియక బ్యాంకు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.