: యాభై ఏళ్ల ఎడబాటుకు సెలవు.. చేగువేరాను కలిసిన ఫిడెల్ కాస్ట్రో
అవును.. యాభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరులు ఇద్దరు కలుసుకున్నారు. అదేంటి! వీరిలో ఒకరు ఎప్పుడో మరణిస్తే.. మరొకరు మొన్ననే మరణించారు కదా.. అన్న సందేహం రావడం సహజమే. అయితే వీరు కలుసుకున్నది భౌతికంగా మాత్రం కాదు. కాస్ట్రో అస్థికలు ఉంచిన వాహనం చేగువేరా స్మారక స్థలానికి చేరుకుంది. తద్వారా ఇద్దరు వీరులు ఒకరినొకరు కలుసుకున్నట్టు క్యూబా ప్రజలు భావిస్తున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసిన క్యూబన్లు ఉద్వేగానికి గురయ్యారు. కళ్ల నుంచి అప్రయత్నంగానే నీళ్లు కారాయి. సోమవారం కన్నుమూసిన కాస్ట్రో అస్థికలను ఉంచిన ప్రత్యేక మిలటరీ వాహనం గురువారం శాంటాక్లారాకి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలో చేగువేరా స్మారక స్థలం, మ్యూజయం ఉన్నాయి. చేగువేరా, కాస్ట్రోల స్నేహానికి గుర్తుగా కాస్ట్రో అస్థికలు ఉంచిన వాహనాన్ని రోజంతా అక్కడ నిలిపారు. వారిద్దరి పోరాటం, త్యాగాన్ని మననం చేసుకునేలా ప్రత్యేకంగా సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలోని సేనలు శాంటియాగో డి క్యూబాలో ఉద్యమం మొదలుపెట్టి 960 కిలోమీటర్ల మేర ప్రయాణించి హవానా వరకు సాగాయి. చివరికి 1959లో క్యూబాను విముక్తం చేశాయి. ఈ పోరాటం సాగిన ప్రాంతాల మీదుగా కాస్ట్రో అస్థికలు ఉంచిన వాహనం ప్రయాణించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రస్తుతం శాంటాక్లారాలో ఉన్న వాహనం ఈనెల 4న శాంటియాగో చేరుకుని యాత్రను ముగిస్తుంది.