: నోట్లు మారుస్తూ దొరికిన మావోలు.. 15 శాతం కమీషన్ అడిగిన పోస్టు మాస్టర్
డబ్బులు మార్చేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలం అటవీ ప్రాంతంలో గజా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో త్రినాథరావు డిప్యూటీ ప్రాజెక్టు మేనేజరుగా, సిద్ధార్థ్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు వారి వద్దకు వచ్చి తమనుతాము మావోయిస్టులుగా పరిచయం చేసుకున్నారు. తమ వద్ద ఉన్న పెద్దనోట్లను మార్చి ఇవ్వాలని వారిని కోరుతూ రూ.12 లక్షలు అప్పగించారు. అసిస్టెంట్ ఇంజినీర్ సిద్ధార్థ్‌కు మంథన్‌గోడ్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ సత్యనారాయణాచారితో పరిచయం ఉండడంతో అతడిని కలిసి 15 శాతం కమిషన్‌పై నోట్లను మార్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం రాత్రి త్రినాథ్‌రావు, సిద్ధార్థ్‌లు డబ్బులు పట్టుకుని మంథన్‌గోడ్ చేరుకున్నారు. విషయం కాస్తా పోలీసులకు చేరడంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.