: విశ్వ కిరీటం మళ్లీ కార్ల్‌సన్‌కే.. వరుసగా మూడోసారి టైటిల్
నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ మరోమారు విశ్వకిరీటాన్ని అందుకున్నాడు. ప్రపంచ చెస్‌లో తనకు తిరుగులేదని నిరూపించాడు. హోరాహోరీగా జరిగిన టైటిల్ పోరులో రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్‌ను ఓడించి జయకేతనం ఎగరవేశాడు. టై బ్రేక్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ సెర్గీపై 3-1 నెగ్గి మరోమారు విశ్వవిజేతగా నిలిచాడు. 12 రౌండ్ల టోర్నీలో తొలుత కార్ల్‌సన్, కర్జాకిన్‌లు 6-6తో సమంగా నిలిచారు. దీంతో టైబ్రేక్ తప్పనిసరి అయింది. నాలుగు గేముల క్విక్‌ఫైర్ రౌండ్ల టోర్నీలో మొదటి రెండూ డ్రాగా ముగియగా 3,4 గేముల్లో కార్ల్‌సన్ నెగ్గి 3-1తో విజేతగా నిలిచాడు. 2013, 2014లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి రికార్డు సృష్టించిన కార్ల్‌సన్ మరోమారు తన సత్తా చాటాడు. కాగా ఫైనల్ పోరులో పాల్గొన్న ఇద్దరు ఆటగాళ్ల వయసు 26 ఏళ్లే కావడం విశేషం. అలాగే పుట్టిన రోజునాడే కార్ల్‌సన్ విశ్వ విజేతగా నిలవడం గమనార్హం. ప్రైజ్ మనీ కింద కార్ల్‌సన్ రూ.3.75 కోట్లు, రన్నరప్ కర్జాకిన్ రూ.3 కోట్లు అందుకున్నారు.