: పాకిస్థాన్ ను మరోసారి హెచ్చరించిన భారత్
భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని నిలిపివేస్తేనే చర్చలు జరుపుతామని పాక్ ను భారత్ మరోసారి హెచ్చరించింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్, ముందుగా తన తీరును మార్చుకుంటేనే చర్చలు సాధ్యమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ద్వైపాక్షిక చర్చల విషయంలో భారత్ ఎప్పుడూ సుముఖంగానే ఉందని, ఈ చర్చల కోసం పాక్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల రీత్యా చర్చలకు అంగీకరించలేమని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లోని నగ్రోటా దాడి ఘటనపై పూర్తి వివరాలు తెలిసిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని, సార్క్ సమావేశాలను భారత్ రద్దు చేయించలేదని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.