: ఈ సిరీస్ లోనే అజ్జూ భాయ్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా?
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ రికార్డు బద్దలు చేయనున్నాడా? అంటే క్రీడావిశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నాడు. ధోనీకి దీటుగా విజయాలు సాధిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్న కోహ్లీ క్రికెట్ లో నెలకొల్పిన అన్ని రికార్డులు బద్దలు కొడతాడని వారు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా ధోనీతో సమానంగా 20 టెస్టుల్లో 12 విజయాలు, 2 పరాజయాలు, 6 డ్రాలు సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా విజయవంతమైన కెప్టెన్ గా నీరాజనాలు అందుకున్న అజహరుద్దీన్ తన కెరీర్ లో 14 విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ తో మరో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో పేసర్లు, స్పిన్నర్లు, టాపార్డర్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ కూడా భారీగా పరుగులు సాధిస్తున్న తరుణంలో మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించి, అజ్జూ భాయ్ రికార్డును సవరించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. తరువాత టీమిండియాను విజయాల బాటపట్టించిన సౌరవ్ గంగూలీ 21 టెస్టు విజయాల రికార్డు, ఆ తరువాత అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నీరాజనాలు అందుకుంటున్న ధోనీ 27 టెస్టు విజయాల రికార్డును కూడా సొంతం చేసుకుంటాడని వారు ఊహిస్తున్నారు.