: భారత్ లో పెద్దనోట్ల రద్దుపై స్పందించిన అగ్రరాజ్యం అమెరికా

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పట్టిపీడిస్తోన్న‌ న‌ల్ల‌ధ‌నాన్ని, న‌కిలీ నోట్ల‌ను అరిక‌ట్ట‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై అమెరికా త‌న అభిప్రాయాన్ని తెలిపింది. ప్ర‌ధాని మోదీ తీసుకున్న ఈ సాహ‌సోపేత నిర్ణ‌యానికి మద్దతు పలికింది. అవినీతిని రూపుమాప‌డానికి ఈ నిర్ణ‌యం ఎంతో ముఖ్యమైన, అవసరమైనదని పేర్కొంది. చట్ట వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న కార్యకలాపాలన్నింటికీ చ‌ర‌మ‌గీతం పాడ‌డానికి ఈ నిర్ణ‌యం ఎంతో తోడ్ప‌డుతుంద‌ని స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ప్రతినిధి మార్క్ టోనర్ పేర్కొన్నారు. ఇండియాలో నివసిస్తోన్న‌, పనిచేస్తోన్న త‌మ దేశ సిటిజన్లకు ఈ అంశంపై సరైన సమాచారం అందే ఉంటుందని తాను అనుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించారు. అమెరికా సిటిజ‌న్లు త‌మ వ‌ద్ద ఉన్న ర‌ద్దైన‌ నోట్లను మార్చుకునే ఉంటార‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఈ నిర్ణ‌యం వల్ల ఎంతో మంది భారతీయులకు కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, వారితో పాటు అమెరికన్లకు కూడా అసౌకర్యం క‌లిగి ఉండ‌వ‌చ్చ‌ని అన్నారు. తాము రాయబారి ద్వారా తమ‌ సిటిజన్లకు భారత్లో జరుగుతున్న మార్పులను గురించి ఇప్ప‌టికే వివరించి చెప్పిన‌ట్లు తెలిపారు. అవినీతి, పన్ను ఎగవేతదారులే ల‌క్ష్యంగా భారత్ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని అన్నారు.

More Telugu News