: అంతా దుష్ప్రచారమే.. గతంలో బంగారంపై విధించిన నిబంధనల్లో మార్పులు లేవు: వెంకయ్యనాయుడు
బంగారంపై ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను విధిస్తోందంటూ వస్తున్న వార్తలన్నీ దుష్ప్రచారమేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వారసత్వంగా వచ్చిన, వ్యవసాయ ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్నులు ఉండబోవని స్పష్టం చేశారు. గతంలో బంగారంపై విధించిన నిబంధనల్లో ఇప్పుడు మార్పులు ఏమీ చేయలేదని అన్నారు. కొంతమంది ఈ అంశంపై ఎన్డీఏ సర్కారుపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని రెవెన్యూ విభాగం త్వరలోనే సమగ్రంగా వివరణ ఇస్తుందని చెప్పారు. పార్లమెంటులో పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజులుగా సభకు వస్తున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు పెద్దనోట్ల రద్దుపై చర్చకు ఎందుకు సహకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ స్వార్థప్రయోజనాలను ఆశించే సభ జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని అన్నారు.