: రాహుల్ దే కాదు... కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ను కూడా హ్యాక్ చేశారు
హ్యాకర్లు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేయడమే కాక, ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హ్యాకర్లు చేసిన పోస్ట్ లను రాహుల్ టీమ్ తొలగించింది. ఇది జరిగిన కాసేపటికే కాంగ్రెస్ అధికార ట్విట్టర్ అకౌంట్ ను కూడా హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఇక్కడ కూడా అభ్యంతరకర వ్యాఖ్యలను వారు పోస్ట్ చేశారు. క్రిస్మస్ లోగా మరోసారి దాడి చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు అవసరమైనంత సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పంపిన ఈమెయిళ్లన్నింటినీ బయట పెడతామని వార్నింగ్ ఇచ్చారు. తమకు ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదని చెప్పారు. మరోవైపు, రాహుల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ... 'రాహుల్, ఆటిజానికి సంబంధించి ఏమైనా పాఠాలు కావాలా?' అంటూ ప్రశ్నించారు.