: నవాజ్ షరీఫ్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ... వివరాలివిగో!


త్వరలో అమెరికాకు అధ్యక్షుడు కానున్న డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు నిన్న నవాజ్ షరీఫ్ ఫోన్ చేసినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆపై షరీఫ్, ట్రంప్ ల మధ్య జరిగిన సంభాషణ వివరాలను పాకిస్థాన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. నవాజ్ ను పోరాటయోధుడిగా ట్రంప్ అభివర్ణించారని, అన్ని విధాలుగా ఆయన సంతృప్తికరంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారని పేర్కొంది. నవాజ్ ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నట్టు తెలిపింది. తాను ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టు లేదని, చాలా కాలంగా స్నేహితుడిగా ఉన్న వ్యక్తితో మనసు విప్పి మాట్లాడుకుంటున్నట్టు ఉందని ఆయన అన్నట్టు పీపీఐబీ వెల్లడించింది. దీర్ఘకాలంగా పొరుగు దేశాలతో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైతే తాను సహకరిస్తానని ట్రంప్ చెప్పినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పాక్ ను సందర్శించాలని షరీఫ్ ఆహ్వానించారని, అందుకు ట్రంప్ సానుకూలంగా స్పందించారని వెల్లడించింది. జనవరి 20న తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అత్యవసరమని భావిస్తే, ఆలోగానైనా తనకు ఫోన్ చేసి మాట్లాడవచ్చని ట్రంప్ చెప్పినట్టు పీపీఐబీ పేర్కొంది.

  • Loading...

More Telugu News