: కోల్ కతా విమానాశ్రయంపై అరగంటపాటు చెక్కర్లు కొట్టిన మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం... 'హత్యకు మోదీ కుట్ర' అంటున్న తృణమూల్!
బీహార్ నుంచి వస్తున్న ప్రైవేటు విమానం అది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కొందరు మంత్రులు ఆ విమానంలో కోల్ కతా వస్తున్నారు. పాట్నాలో 7:35 గంటలకు బయలుదేరిన విమానం కోల్ కతాకు 8:35 గంటలకు చేరుకున్నప్పటికీ, వెంటనే ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో అరగంటపాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టి చివరికి 9 గంటలకు అనుమతి లభించడంతో అక్కడ అడిగింది. ఇంధనం అయిపోతోందని పైలట్ గగ్గోలు పెట్టాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ అధికారులకు తమ విమానం గమనాన్ని గురించి చెబుతున్నా, వారు పట్టించుకోలేదని పైలట్ విమర్శిస్తుండగా, ఎయిర్ పోర్టుల్లో ఈ తరహా ఘటనలు మామూలేనని అధికారులు అంటున్నారు. ఇక మమత ప్రయాణిస్తున్న విమానం గాల్లో చక్కర్లు కొట్టడంపై తృణమూల్ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తమ అధినేతను హత్య చేయించేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. అందువల్లే విమానం కిందకు దిగేందుకు అనుమతించలేదని అరోపించారు. పెద్ద నోట్ల రద్దును ప్రశ్నించినందుకే ఆమెను చంపాలని అనుకొంటున్నారని, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఫిర్హాద్ హమీక్ వ్యాఖ్యానించారు.