: భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల కొత్త మార్గాలు.. సొరంగాల ద్వారా దేశంలోకి..!
సరిహద్దుల్లో నిఘా పెరిగిపోవడంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. సొరంగాలు ఏర్పాటు చేసుకుంటూ వాటి గుండా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. మంగళవారం జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి ప్రవేశించి కాల్పులతో బీభత్సం సృష్టించి హతమైన ముగ్గురు ఉగ్రవాదులు కూడా సొరంగ మార్గం ద్వారా భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారని బీఎస్ఎప్ డీజీ కేకే శర్మ తెలిపారు. వ్యవసాయ పొలాల కింద 2 మీటర్ల ఎత్తు, 2 మీటర్ల వెడల్పుతో 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని గుర్తించినట్టు ఆయన వివరించారు. తనిఖీల ద్వారా సొరంగాలను గుర్తించడం తప్ప వాటిని కనుగొనేందుకు ప్రత్యేకమైన పరిజ్ఞానం సరిహద్దు భద్రతాదళం వద్ద లేదని ఆయన పేర్కొన్నారు. భద్రతా దళాల చేతిలో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు సైనికాధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని పలు రైళ్లలో వీరు భారీ ఎత్తున పేలుళ్లకు కుట్ర పన్నినట్టు అధికారులు భావిస్తున్నారు.