: ఉద్యోగుల వెతలు తీర్చేందుకు వినూత్న మార్గాలు.. జీతాలకు బదులు టోకెన్లు!
ఒకటో తారీఖు.. ఈ రోజు కోసం ఎదురుచూసేవారు ఎందరో. జీతాలు పడే రోజు కావడంతో ఒకటో తేదీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ, ఈసారి ఈ తేదీ కొద్దిగా లేటుగా వస్తే బాగుండుననే చాలామంది అనుకున్నారు. కారణం అదరికీ తెలిసిందే.. నోట్ల రద్దు! బ్యాంకుల్లో సరిపడా డబ్బులు ఇవ్వక, ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో డబ్బులు ఉండీ తీసుకోలేని పరిస్థితి. నోట్ల కష్టాలు కొనసాగుతుండగానే ఒకటో తేదీ వచ్చేసింది. కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో తమ ఉద్యోగుల వెతలను తీర్చేందుకు పలు సంస్థలు వినూత్న మార్గాలు ఎంచుకుంటున్నాయి. అలా ఎంచుకున్న కంపెనీల్లో తమిళనాడుకు చెందిన ఫరీదా గ్రూపు కూడా ఉంది. ఫరీదా గ్రూపులో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతినెలా వీరికి బ్యాంకుల ద్వారానే జీతాలు చెల్లిస్తారు. ఈ సారి వారి ఖాతాల్లో డబ్బులు జమచేసినా తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో తమ ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏం చేయాలో ఆలోచించి చివరికి నాలుగు స్థానిక పచారీ దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగులకు రూ.1000, రూ.500, రూ.200 విలువ చేసే టోకెన్లు పంపిణీ చేసింది. ఎంపిక చేసిన నాలుగు షాపుల్లో వాటిని ఇచ్చి కావాల్సిన సరుకులు కొనుగోలు చేసుకోవచ్చన్నమాట. వచ్చిన టోకెన్లను ఆయా దుకాణాలు తిరిగి సంస్థకు అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటాయి. ఒకటో తేదీ గండం గట్టెక్కడానికి సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని సంస్థలు కూడా ఇంచుమించు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సూపర్ మార్కెట్లు, హోటళ్లు, షాపింగ్ కాంపెక్స్‌లలో వాడుకునేలా ప్రత్యేకంగా ప్రీపెయిడ్ కార్డులను జారీ చేస్తున్నాయి.