: ఒక్క ఫోన్ కాల్ తో 29 మందిని బదిలీ చేసిన మిమిక్రీ ఆర్టిస్టు!
ఓ మిమిక్రీ ఆర్టిస్టు తన టాలెంట్ తో 29 మందిని బదిలీ చేయించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని దిండిగల్ జిల్లాకు చెందిన మిమిక్రీ కళాకారుడు సావరి ముత్తు విద్యుత్ శాఖ మంత్రి పీ.థంగమణి స్వరాన్ని అనుకరిస్తూ ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు ఫోన్ చేశాడు. థర్మల్ యూనిట్ లో ఉన్న 29 మంది అధికారులను బదిలీ చేయాలని సూచించాడు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ జయకుమార్ ను విద్యుత్ ప్రొడక‌్షన్ యూనిట్ నుంచి బొగ్గు నిర్వహణ సెక‌్షన్ కు బదిలీ చేశారు. ఆయన తన విధులు సరిగ్గా నిర్వహించడం లేదని ఆరోపిస్తూ అతనిపై సస్పెన్షన్ వేటు వేయించాడు. దీంతో సహోద్యోగుల సలహాతో జయకుమార్ నేరుగా మంత్రి థంగమణిని కలిశాడు. తాను ఏ తప్పూ చేయలేదని, అకారణంగా తనను సస్పెండ్ చేశారని, ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలని కోరారు. దీంతో షాక్ తిన్న థంగమణి అసలు తాను బదిలీలు చేయించలేదని తెలిపారు. వెంటనే పోలీసు విచారణకు ఆదేశించారు. దీంతో ఆ ఫోన్ నెంబర్లను పరిశీలించిన పోలీసులు బదిలీ వ్యవహారం సావరి ముత్తుదని గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అతనిని రిమాండ్ కు తరలించారు. ఈ ట్రాన్సఫర్లను ఎందుకు చేయించాడో మాత్రం వెల్లడించకపోవడం విశేషం.