: ప్రొఫెషనల్ బాక్సింగ్ మాటెత్తని విధంగా విజేందర్ కు పంచ్ రుచి చూపిస్తా: చెకా వార్నింగ్
డిసెంబర్ 17న జరగనున్న బౌట్ లో భారత బాక్సర్ విజేందర్ సింగ్ కు మర్చిపోలేని విధంగా పంచ్ ల రుచిచూపిస్తానని ప్రపంచ మాజీ ఛాంపియన్ ఫ్రాన్సిస్ చెకా వార్నింగ్ ఇచ్చాడు. విజేందర్ తో జరగనున్న పోరు గురించి మాట్లాడుతూ, విజేందర్ ఇంత వరకు ఓటమి ఎరుగని వాడన్న సంగతి తనకు తెలుసని అన్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ పేరెత్తని విధంగా తన పంచ్ ల రుచి చూపిస్తానని చెప్పాడు. దాని కోసం కోచ్ జే ఆధ్వర్యంలో కఠిన శిక్షణ తీసుకుంటున్నానని చెప్పాడు. దీంతో తన శక్తి రోజురోజుకీ పెరుగుతోందని తెలిపాడు. రోజూ 40 రౌండ్లు సాధన చేస్తున్నానని తెలిపాడు. విజేందర్ బలాలు, బలహీనతలు గుర్తించానని అన్నాడు. 300 రౌండ్లు ఆడిన తాను 17 మందిని నాకౌట్ చేశానని విజేందర్ గుర్తుంచుకోవాలని తెలిపాడు. కాగా, విజేందర్ తో తలపడిన ప్రతి ఆటగాడు బౌట్ కు ముందు మాటల పోరాటం ప్రారంభించి, బౌట్ లో చేతులెత్తేయడం జరిగింది. కాగా, చెకా కఠినమైన ప్రత్యర్థి కావడంతో వీరిద్దరి మధ్య డిసెంబర్ 17న జరగనున్న బౌట్ హోరాహోరీ సాగుతుందని అంతా అంచనా వేస్తున్నారు.