: చంద్రబాబు కన్వీనర్‌గా 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర సర్కారు
దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గ ప్రణాళికలను రచించుకుంటోంది. దేశంలో పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత దేశంలోని పరిస్థితుల అధ్యయనంతో పాటు నగదు రహిత లావాదేవీల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే కేంద్ర సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఈ అంశంపై మరింత స్పష్టతనిచ్చింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రులతో పాటు అధికారులు కూడా వుంటారు. ఈ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులను నియమించినట్లు కేంద్రం పేర్కొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కమిటీ సభ్యులుగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, పుదుచ్చేరి సీఎం వీ.నారాయణ స్వామి, సిక్కిం సీఎం పీకే చామ్లింగ్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తో పాటు పలువురిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించినట్లు తెలిపింది. డిజిటల్ పేమెంట్స్ లో భాగంగా కార్డుల వినియోగం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర అంశాలపై ఈ కమిటీ సమగ్ర నివేదిక రూపొందిస్తుందని చెప్పింది.