: మోదీ నిర్ణయం తెలివైనది కాదు...మానవత్వం లేనిది: అమర్త్యసేన్
ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తెలివైన నిర్ణయం కాదని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తెలివితక్కువ నిర్ణయమని, మానవత్వం లేని చర్య అని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బ్యాంకులు, బ్యాంకు ఖాతాలతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థను బలహీన పరిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నిర్ణయం నమ్మకంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ మూలాలకు అడ్డుకట్ట వేసే చర్య అని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆర్థిక విశ్వాసాన్ని దెబ్బతీయడంతోపాటు ప్రభుత్వం నోటుపై ఇచ్చిన వాగ్దానాన్ని వమ్ముచేయడమేనని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం, భారత ఆర్థిక వ్యవస్థకు పెను విపత్తుగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.