: దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులపై లోక్ సభలో స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
పెద్దనోట్ల రద్దుతో పాటు నిన్న నగ్రొటాలో జరిగిన సైనికులపై దాడి ఘటనపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో ఈ రోజు విపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. తాము ఏ అంశంపైనైనా సరే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారపక్ష నేతలు తెలిపినప్పటికీ సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా లోక్ సభలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులపై మాట్లాడారు. దేశంలో నిఘా వైఫల్యం కారణంగానే ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారని, ఇటీవల జరిగిన పఠాన్ కోట్, ఉరీ ఉగ్రవాద దాడుల ఘటనలు అందుకే జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే నిన్న కూడా నగ్రోటా దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఈ దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.