: చుడీ దార్ లు ధరించిన మహిళా భక్తులను అడ్డుకున్న పద్మనాభ స్వామి ఆలయ సిబ్బంది
కేరళలోని పద్మనాభ స్వామిని దర్శించేందుకు చుడీ దార్ లు ధరించి వచ్చిన మహిళా భక్తులను దేవాలయ అర్చకులు, సిబ్బంది అడ్డుకున్నారు. ఆలయంలోకి వారిని అనుమతించలేదు. దీంతో, మహిళా భక్తులు, ఆలయ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. సిబ్బంది తీరును నిరసిస్తూ బాధిత భక్తులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మహిళలు చుడీదార్ లు ధరించి ఆలయంలోకి ప్రవేశించవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆలయ అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పద్మనాభ స్వామి ఆలయ ఈఈ కేఎన్ సతీశ్ మాట్లాడుతూ, జిల్లా జడ్జి తమ ఆలయానికి రాసిన లేఖ ప్రకారం, ‘విచక్షణను అనుసరించి నిర్ణయం తీసుకోవాలి’ అని పేర్కొన్నారని అన్నారు. అయితే, ఆ ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయని, అందుకే, చుడీదార్ లతో ఆలయానికి వచ్చిన మహిళా భక్తులను అనుమతించలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, కాలానుగుణంగా పలు ఆలయాల నియమ నిబంధనల్లో మార్పులు జరిగాయని అన్నారు. పద్మనాభ స్వామి ఆలయం వద్ద నెలకొన్న పరిస్థితిపై అధికారులతో మాట్లాడతానని చెప్పారు. అయితే, పద్మనాభ స్వామి ఆలయంలోకి ప్రవేశించే మహిళలు చీరలు మాత్రమే ధరించాలనే కట్టుబాటు కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీనిని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త రియా రాజి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్పందించిన హైకోర్టు.. మహిళలు చుడీదార్లు ధరించి ఈ ఆలయంలోకి వెళ్లవచ్చని నిన్న తీర్పు నిచ్చింది.