: వేరే బ్రాండ్ కి చెందిన షూస్ వేసుకొచ్చాడని విద్యార్థిని ఇంటికి పంపిన స్కూలు సిబ్బంది
విద్య పూర్తి స్థాయి వ్యాపారంగా మారుతోందనడానికి ఉదాహరణగా, మరో ఘటన హైదరాబాద్ శివారులోని ఉప్పల్ లో ఉన్న గ్లోబల్ ఇండియన్ స్కూల్‌లో వెలుగుచూసింది. పాఠశాలలు ప్రారంభమైంది మొదలు ట్యూషన్ ఫీజులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ముక్కు పిండి వేలకు వేలు వసూలు చేసే యాజమాన్యాలు... పుస్తకాలు, యూనిఫామ్, షూస్ వంటివి కూడా తమ వద్దే కొనాలని, లేదంటే పాఠశాలలోకి అనుమతించబోమని బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ రోజు ఉప్పల్ లోని గ్లోబల్ ఇండియన్ స్కూల్‌లో తాము సూచించిన కంపెనీ షూస్ తో కాకుండా వేరే కంపెనీకి చెందిన షూస్ వేసుకొచ్చాడంటూ ఓ విద్యార్థిని పాఠశాలలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో సదరు విద్యార్థి పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆగ్రహం తెచ్చుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీనికి స్పందించిన స్కూలు యాజమాన్యం రిబాక్ బ్రాండ్ షూస్ వేసుకొని మాత్రమే రావాలని చెప్పామని, సదరు విద్యార్థి బాటా షూస్ తో పాఠశాలకు వచ్చాడని చెప్పారు. దీంతో స్కూలు యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు మండిపడ్డారు.