: సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ జరుగుతోంది... దేశ భద్రత అంశాన్ని రాజకీయం చేయకూడదు: అనంత కుమార్
లోక్సభలో పెద్దనోట్ల రద్దు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబడుతున్నారు. పెద్దనోట్ల రద్దుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో పాటు నగ్రోటా అంశంపై కూడా చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే, స్పీకర్ సుమిత్రా మహాజన్ నగ్రోటా ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పూర్తి నివేదిక ఇంకా అందలేదని, దానిపై చర్చ కుదరదని చెప్పారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ కల్పించుకొని దేశ భద్రత అంశాన్ని రాజకీయం చేయకూడదని ప్రతిపక్ష పార్టీల నేతలకి సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు. విపక్ష సభ్యులు ఏ అంశంపై చర్చించాలనుకుంటే... ఆ అంశంపై చర్చించడానికి తాము కూడా సన్నద్ధంగానే ఉన్నామని చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఓటింగ్ చేపట్టాలని విపక్ష నేతలు చేస్తున్న డిమాండ్ పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.