: భారత్ లో భారీ పేలుళ్లు జరిపేందుకు అమెరికా నుంచి ప్లాన్ వేసిన పంజాబీ
అతడు జన్మతః భారతీయుడే.. కానీ, అమెరికాలో ఉంటూ తన మాతృదేశంలో పేలుళ్లు జరిపేందుకు కుట్రలు పన్నుతున్నాడు. అంతేకాదు, అమెరికా శాశ్వత పౌరసత్వం కూడా తీసుకున్నాడు. సదరు వ్యక్తిని తాజాగా అమెరికాలోని ఓ న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. వివరాళ్లోకి వెళితే, బల్వీందర్ సింగ్ అనే పంజాబీ అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అక్కడే ఉంటూ ఖలిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నాడు. తన సొంత రాష్ట్రంలోనే పేలుళ్లు జరపడం, పలువురు భారత అధికారులను హతమార్చడం వంటి చర్యలకు స్కెచ్ వేస్తున్నాడు. పేలుళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సిన పేలుడు సామగ్రిని బల్వీందర్ సింగ్ ఇప్పటికే పంపిణీ చేశాడు. పేలుళ్లకు సంబంధించి ఉగ్రవాదులతో ఫోన్ లో సంభాషిస్తున్నాడు. అతడిపై అనుమానం వచ్చి నిఘా ఉంచిన అధికారులు 2013 డిసెంబర్లో అరెస్టు చేసి పూర్తి వివరాలను సేకరించారు. చివరగా నిన్న న్యాయస్థానం అతడు నేరానికి పాల్పడినట్లు తేల్చింది. దీంతో అతడికి కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియాలో భారీ కుట్రలకు పాల్పడడానికి బల్వీందర్ సింగ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని న్యాయమూర్తి పేర్కొన్నారు.