: ఆశలు రేపి.. కనుమరుగైన కొత్త రూ.500 నోట్లు.. కారణం ఏంటట?
కొత్త రూ.500 నోట్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన వారికి కళ్లకు వాపులు తప్ప కొత్త నోట్లు మాత్రం కనిపించడం లేదు. 'ఇదిగిదిగో వచ్చేశాయి.. ఆర్బీఐ లారీలకు లారీల డబ్బులు పంపింది' అంటూ ప్రజలు సంతోషపడడం తప్ప, ఇప్పటి వరకు రూ.500 నోటు ఎలా ఉంటుందో కూడా చూడలేదంటే అతిశయోక్తి కాదేమో. ఆశలు రేపి ఉసూరుమనిపించడం వెనక కారణం ఏంటంటే.. అందులోని లోపాలే! కొత్త రూ.500 నోట్లు మార్కెట్లోకి వస్తే చిల్లర కొరత తీరుతుందని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. అనుకున్నట్టే తెలంగాణ రాష్ట్రానికి రూ.500 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు వచ్చాయి. అయితే ప్రజలు వాటిని చూడకుండానే కనుమరుగయ్యాయి. పంపిన నోట్లలో లోపాలు ఉన్నట్టు గుర్తించిన రిజర్వు బ్యాంకు వాటిని తిరిగి వెనక్కి తీసుకుంది. ఏటీఎంలకు వెళ్లకుండానే కొత్త నోట్లు తిరిగి ఆర్బీఐకి చేరాయి. విషయం తెలియని ప్రజలు ఇదిగో అదుగో అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చిన నోట్లు వెనక్కి వెళ్లిపోవడంతో మళ్లీ అవెప్పుడు వస్తాయో, తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.