: మాటమార్చిన లాలూ.. నోట్ల రద్దుకు తాను అనుకూలమని వ్యాఖ్య
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్ మాటమార్చారు. ఇప్పటి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా గళమెత్తిన ఆయన మంగళవారం ఒక్కసారిగా ప్రభుత్వ అనుకూల రాగం అందుకున్నారు. నోట్ల రద్దుకు తాను వ్యతిరేకం కాదని, అయితే అమలులోని లోపాలనే తాను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. ప్రధాని నోట్ల రద్దు నిర్ణయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొలి నుంచీ మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వంలోని సంకీర్ణమైన ఆర్జేడీ, కాంగ్రెస్‌లు నితీశ్‌పై విరుచుకుపడ్డాయి. ఇరు వర్గాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నితీశ్ కుమార్..లాలూను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా లాలు మాట్లాడుతూ తాను నోట్ల రద్దుకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నిర్ణయం అమలులోని లోపాలను మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని వివరించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్‌లు ఇద్దరూ నోట్ల రద్దుకు అనుకూలమేనని ఆర్జేడీ ఎమ్మెల్యే అన్వర్ అలాం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి లాలు తన మద్దతు ప్రకటించారని, అయితే అమలు విషయంలో మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.