: డేట్ సల్మాన్ భాయ్ ఫిక్స్ చేశాక రిలీజ్ చేయననడానికి నేనెవర్ని?: షారూఖ్
తమ మధ్య విభేదాలు సమసిపోయిన తర్వాత షారూఖ్, సల్మాన్ మంచి స్నేహాన్ని పంచుకుంటున్నారు. ప్రేమాప్యాయతలు కూడా పంచుకుంటుంటారు. సల్మాన్ కాస్త తుంటరి, షారూఖ్ జాగ్రత్తపరుడు. దీంతో విరిద్దరి మధ్య చోటుచేసుకునే ఏ సన్నివేశమైనా అభిమానులకు ఆసక్తికరమే. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య తాజాగా జరిగిన ట్విట్టర్ సంభాషణ వివరాల్లోకి వెళ్తే... షారూఖ్, అనుష్క హీరోహీరోయిన్లుగా 'హైవే', 'తమాషా' ఫేమ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ తాజాగా ఓ సినిమా రూపొందిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘ది రింగ్’ అనే టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది నవంబర్ లో ప్రారంభమైంది. దీనిని వచ్చే ఏడాది (2017) ఆగస్టు 11న విడుదల చేయనున్నామని ఇంతియాజ్ అలీ ఎప్పుడో ప్రకటించేశాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ ను ట్వీట్ చేస్తూ ‘షారూఖ్ ఖాన్ సినిమా వస్తోంది.. రిలీజ్ డేట్ నేనే ఫిక్స్ చేశా. టైటిల్ ఏం పెట్టాలో మీరు డిసైడ్ చెయ్యండి’ అని కామెంట్ జతచేసి, ఈ సినిమా యూనిట్ అయిన షారూఖ్, అనుష్క, ఇంతియాజ్ అలీలను ట్యాగ్ చేశాడు. దీనిపై షారుఖ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ‘అవునా? అరే, ఈ సంగతి నాకు తెలియదే! అయినా డేట్ భాయి (సల్మాన్) ఫిక్స్ చేశాక రిలీజ్ చెయ్యక చస్తామా? సరే, అలాగే ఆ రోజు రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాం...సరే డేట్ ఎలాగూ చెప్పావు కదా? ఆ టైటిల్ కూడా నువ్వే చెప్పరాదూ’ అంటూ జవాబిచ్చాడు. మధ్యలో అనుష్కశర్మ కలగజేసుకుంటూ, ‘రిలీజ్ డేట్ నువ్వు డిసైడ్ చేయడమేంటి?’ అంటూ కాస్తంత మిర్చి జతచేసింది. వీరి ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.