: డిసెంబర్ 3న విజయవాడలో 'వంగవీటి' ఆడియో వేడుక
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న 'వంగవీటి' చిత్రం ఆడియో వేడుక డిసెంబర్ 3న విజయవాడలో జరుగుతుందని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. విజయవాడలోనే కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ వేడుకను నిర్వహించనున్నామని వర్మ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను సినిమా యూనిట్ ఆవిష్కరించింది. గతంలో విజయవాడలో చోటుచేసుకున్న వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకు బెదిరింపులు కూడా వచ్చాయని గతంలో ఆయన పేర్కొన్నారు కూడా. ఈ నేపథ్యంలో విజయవాడలో చోటుచేసుకున్న సామాజికవర్గాల ఘర్షణలను వర్మ ఎలా తెరకెక్కించనున్నాడన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. సందీప్‌కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలీ, కౌటిల్య తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమాను బ్యాడ్-కౌ ఫిల్మ్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం వర్మ రాసిన 'కమ్మ-కాపు' పాట కలకలం రేపిన సంగతి తెలిసిందే.