: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో ట్రంప్, పుతిన్ లను వెనక్కినెట్టిన మోదీ
పలు దేశాలు, సంస్థలు విశిష్టంగా భావించే అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ను దక్కించుకునే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరుగులు తీస్తున్నారు. ఈ రేసులో అమెరికా అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా మోదీ వెనకే ఉన్నారు. టైమ్స్ రీడర్స్ ఛాయిస్ ఓటింగ్‌లో మోదీ 21 శాతం ఓట్లను సాధించారు. వచ్చే నెల 4వ తేదీతో రీడర్స్ ఓటింగ్ ప్రక్రియ సమాప్తం కానుంది. ఇందులో మోదీ డూకుడు పరిశీలిస్తే 2016 టైమ్స్ రీడర్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దాదాపు ఆయనకే ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల గోవాలో బ్రిక్స్ దేశాల సదస్సులో మోదీ చేసిన ప్రసంగం ప్రపంచదేశాల్ని ఆకర్షించిందని, పాకిస్థాన్‌ను ఎండగడుతూ ఆ దేశం ఉగ్రవాదానికి తల్లిలాంటిదంటూ చేసిన ప్రకటన రీడర్లను బాగా హత్తుకుందని, టైమ్స్ మ్యాగజైన్ ప్రతినిధులు పేర్కొన్నారు. అందుకే టైమ్స్ రీడర్లు ఆయనకు భారీగా ఓట్లు వేస్తున్నారని తెలిపారు. గత ఏడాదిలోనూ 'టైమ్స్ రీడర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా మోదీకే రీడర్లు ఓట్లు వేశారు. అయితే, ప్రధాన అవార్డు ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ మాత్రం జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్‌కు లభించింది. ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ లో మోదీ ఇప్పటివరకు మొదటి శాతంలో ఉండగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 7 శాతం, వ్లాదిమిర్ పుతిన్, డోనాల్డ్ ట్రంప్‌లకు 6 శాతం ఓట్లు వచ్చాయి. వీళ్లతో పాటు రేసులో వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే హిల్లరీ క్లింటన్, ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్, బ్రిటన్ పీఎం థెరిసా మే, చైనా అధ్యక్షుడు జింగ్ పిన్, ఎఫ్‌బీఐ మాజీ చీఫ్ జేమ్స్ కామీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, అమెరికన్ ముస్లిం సైనికుడి (హుమాయున్ ఖాన్) తల్లిదండ్రులు కూడా ఈ అవార్డును పొందడానికి రేసులో ఉన్నారు.