: నభా జైల్లో ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లు రాజభోగాలు అనుభవిస్తున్నారట!


పంజాబ్ లోని పాటియాలా ప్రాంతంలో ఉన్న నభా జైలుపై ఆదివారం నాడు సాయుధులు దాడి జరిపి, ‘ఖలిస్థాన్’ చీఫ్ తో పాటు మరికొంతమంది ఉగ్రవాదులను తమతో పాటుగా తీసుకుపోయిన సంఘటన విదితమే. ఈ నేపథ్యంలో నభా జైలుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లు రాజభోగాలు అనుభవిస్తున్నారట. జైల్లో ఖైదీలు అందరూ తినే మెస్ లో ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్ లు తినరట. వాళ్లకు కావాల్సిన ఆహార పదార్థాలను తోటి ఖైదీలతో వండించుకుని, ప్రత్యేకంగా కూర్చుని తింటారట. ఈ విషయాలన్నీ జైలు అధికారులకు తెలిసినా తమకు పట్టనట్లే వ్యవహరిస్తారని ఓ జైలు అధికారి పేర్కొన్నారు. గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాద ఖైదీల పుట్టినరోజులకు కేక్ లు కోయడం, శారీరక ఆరోగ్యం కోసం జిమ్ లు, వ్యక్తిగత వంటమనుషులు ఉండటం మామూలేనట. ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించిన రహస్య నివేదిక ప్రకారం నభా జైల్లో ఖైదీలు ఇప్పటివరకు ‘ఫేస్ బుక్’ మాధ్యమం ద్వారా 150 ఫొటోలు పోస్ట్ చేశారని సమాచారం. జైలు సిబ్బందిపై చేయిచేసుకున్న కేసులు చాలా మటుకు బయటకు రాలేదని, ఉగ్రవాదుల కంటే గ్యాంగ్ స్టర్లతో చాలా ప్రమాదమని జైలు అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. కాగా, జైలు నుంచి ఇటీవల తప్పించుకుని పోలీసులకు పట్టుబడ్డ ఖైదీ గుర్ ప్రీత్ సింగ్.. ఈ నెల 22న తన స్నేహితుడు కుల్ ప్రీత్ సింగ్ తో కలిసి పుట్టినరోజు జరుపుకున్నాడు. బర్త్ డే కేక్ తో సహా ఫొటో దిగి, ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాదు, జైలు బయట ఉన్న తమ అనుచరుల చేత హత్యలు చేయించి.. ఆ హత్యలు తామే చేయించామని ‘ఫేస్ బుక్’ ద్వారా జైలులోని గ్యాంగ్ స్టర్లు, ఉగ్ర వాద ఖైదీ లు చెబుతున్నారు. పంజాబ్ గ్యాంగ్ స్టర్, రాజకీయవేత్త జస్వీందర్ సింగ్ అలియాస్ రాకీ ఏప్రిల్ లో హిమాచల్ ప్రదేశ్ లో హత్యకు గురైనప్పుడు..ఈ పని చేయించింది తానేనని నభా జైలు ఖైదీ విక్కీ గోండార్ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News