: రైతుబజార్ వద్ద ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాన్ని అడ్డుకొని బైఠాయించిన రైతులు
ఖమ్మం జిల్లాలోని రైతు బజార్‌లో వ్యాపారులు, రైతులకి మధ్య చెలరేగుతున్న ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. ఆయన రైతు బజార్‌లోని వ్యాపారులకు కాకుండా బయటి వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు అనంతరం అక్కడి రహదారిపై బైఠాయించారు. వ్యాపారులు బయట మార్కెట్ నుంచి ఖమ్మం రైతుబజార్‌కు కూరగాయలు తీసుకొస్తున్నారని, అనంతరం మార్కెట్ ఎదుటే వాటిని విక్రయిస్తున్నారని రైతులు అంటున్నారు. దీంతో ఈ వివాదంలో కలుగజేసుకున్న ఎమ్మెల్యే పువ్వాడ వ్యాపారులకు రైతుబజార్‌లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రైతులు మరింత మండిపడ్డారు. వ్యాపారులకు స్టాళ్లు ఎలా ఏర్పాటు చేస్తారని రైతులు ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు అక్కడకు చేరుకొని, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లడానికి రైతులు అనుమతించారు.