: ‘బాంబు దాడి’.. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టేకు తప్పిన పెను ప్రమాదం
ఫిలిప్పీన్స్ లోని మానావి నగరంలో ఈ రోజు ఉదయం తీవ్ర కలకలం చెలరేగింది. ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టే లక్ష్యంగా పలువురు దుండగులు బాంబు దాడి చేశారు. ఆ నగరంలో రోడ్రిగో కాన్వాయ్ వెళుతోన్న సమయంలో దుండగులు ఐఈడీ బాంబు పేల్చారు. దీంతో అధ్యక్షుడి ప్రత్యేక భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 9 మంది సిబ్బందికి గాయాలయ్యాయని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో రోడ్రిగో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించారు. ఆయన కాన్వాయ్ ముందు 50 మంది వివిధ రకాల ప్రత్యేక సిబ్బంది వెళుతున్నారని, వీరి వెనుక మీడియా, ఆర్మీ సిబ్బంది ఉంటారని, తొమ్మిది మంది మినహా వేరెవరికీ గాయాలు కాలేదని చెప్పారు. ఈ దాడి చేసింది మౌతే గ్రూప్ ఉగ్రవాదులేనని భావిస్తున్నారు.