: వసూలైన నల్లధనం అంతా పేదలకే.. బీజేపీ పార్లమెంటరీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ
న్యూఢిల్లీలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. వసూలైన నల్లధనం అంతా పేదల కోసమే ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆదాయపన్ను చట్టసవరణ బిల్లు అనేది నల్లధనాన్ని అధికారికం చేసేదికాదని వ్యాఖ్యానించారు. దేశంలోని పేదల సంక్షేమానికి ఆదాయపన్ను చట్టసవరణ బిల్లు ఉపయోగపడుతుందని అన్నారు. బీజేపీ ఎంపీలు పెద్దనోట్ల రద్దు తరువాత చేపట్టిన అవగాహన కార్యక్రమాల గురించి పార్టీ కార్యాలయాలకు నివేదిక అందించాలని కోరారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు పర్యటించాలని, ప్రజలకు నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తూ, పెద్దనోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాలను తెలపాలని మోదీ చెప్పారు. దేశంలో నల్లధనాన్ని మెడలు వంచి వెలుగులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ఈ-బ్యాంకింగ్, కార్డుల ఉపయోగం వంటి వాటిపై ప్రజలతో సహా చిన్న వ్యాపారులకు అవగాహన కల్పించాలని అన్నారు. మరోవైపు బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా తమ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాలని, ఇదే భేటీలో మోదీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.