: ఆర్బీఐ దెబ్బకు... నోట్ల రద్దు తరువాత వడ్డీ రేట్లేం పెద్దగా తగ్గవు!
ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తరువాత, బ్యాంకుల్లోకి ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్లు చేరుతాయని, తద్వారా రుణాల లభ్యత సరళీకృతమై, వడ్డీ రేట్లు కూడా దిగివస్తాయని భావిస్తున్న ప్రజల ఆశలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీళ్లు చల్లింది. బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా తగ్గించేందుకు వీలు లేకుండా సీఆర్ఆర్ (నగదు నిల్వల నిష్పత్తి)ను నవంబర్ 8 నుంచి సేకరించిన డిపాజిట్లపై 100 శాతం నిర్వహించాల్సిందేనని కీలక ప్రకటన చేసింది. దీంతో తమ వద్దకు వచ్చిన డిపాజిట్లన్నింటినీ లెక్కల్లో చూపుతుండాల్సిన పరిస్థితి బ్యాంకులకు ఎదురైంది. ఈ నేపథ్యంలో నిర్వహణా వ్యయం, వేతనాది ఖర్చులను కొనసాగించేందుకు వడ్డీ రేట్లు ప్రస్తుతమున్న స్థితిలోనే బ్యాంకులు కొనసాగించక తప్పదని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత విషయంలో తీరని కొరత ఏర్పడింది. బ్యాంకుల్లో నగదు నిల్వ చాలినంతగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ చెబుతున్నప్పటికీ, అది ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. నేడు సైతం బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు, నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇదిలావుండగా, భారత ప్రభుత్వం జారీ చేసే బాండ్ల విలువ గణనీయంగా పెరిగింది. 10 సంవత్సరాల బాండ్లపై రాబడి 6.23 శాతం నుంచి 6.32 శాతానికి పెరిగింది.