: కోటీ 37 లక్షల కొత్త నోట్లను కొల్లగొట్టిన డ్రైవర్ అరెస్ట్
ఏటీఎంలలో పెట్టాల్సిన కోటీ 37 లక్షల రూపాయలతో పారిపోయిన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ సెల్వరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కేఆర్ పురం ప్రాంతలో అతడిని అరెస్ట్ చేశారు. ఈ నెల 23వ తేదీన బెంగళూరులోని వసంతనగర్ ప్రాంతంలో ఖాళీగా వదిలి పెట్టిన వ్యాన్ ను పోలీసులు సోదా చేయగా... రూ. 45 లక్షల క్యాష్, ఓ తుపాకీ లభ్యమయ్యాయి. దీంతో, ఈ డబ్బును కొల్లగొట్టింది డ్రైవర్ సెల్వరాజే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత అతని కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో, సెల్వరాజ్ తల్లిని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రెండు నెలల క్రితమే భార్యతో కలిసి తన కొడుకు వేరు కాపురం పెట్టాడని... లింగరాజపురం ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడని అతని తల్లి చెప్పింది. ఆ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా అతని భార్య వద్ద రూ. 79.8 లక్షలు దొరికాయి. అనంతరం సెల్వరాజ్ ను కేఆర్ పురం ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.