: మోదీతో గంట మాట్లాడాను: కేసీఆర్


ప్రధాని నరేంద్ర మోదీతో గంటసేపు మాట్లాడానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో కేబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, నల్లధనాన్ని అరికట్టేందుకు గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టడీ నిర్వహించామని అన్నారు. ఎన్నో రూపాల్లో ఉన్న నల్లధనాన్ని ఎలా అరికట్టవచ్చు? అన్నదానిపై ప్రధానికి సూచనలు అందించానని ఆయన చెప్పారు. అన్ని రూపాల్లోను ఉన్న నల్లధనాన్ని రూపుమాపి, కరప్ట్ ఫ్రీ కంట్రీని తయారు చేయాలన్న కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రం పాత్ర గురించి కేబినెట్ భేటీలో చర్చించామని అన్నారు. కేంద్రం చేసిన యాక్ట్ ను అమలు చేయాల్సిందేనని ఆయన చెప్పారు. కొన్ని యాక్ట్స్ ను మార్చి రాష్ట్రాలు అమలు చేయవచ్చని తెలిపారు. డీమోనిటైజేషన్ మొదలు పెట్టి 18 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రధానికి సూచనలు ఇచ్చానని ఆయన అన్నారు. కేంద్రం 25 కోట్ల జన్ ధన్ అకౌంట్లను తెరవగా, అందులో 82 లక్షల అకౌంట్లు తెలంగాణలో ఉన్నాయన్నారు. చెక్కులిచ్చి అరటిపండ్లు, చేపలు, కూరగాయలు కొనుక్కొనే అలవాటు భారతీయులకు లేదని ఆయన చెప్పారు. 1,40,00,00,000 కోట్ల రూపాయల భారతీయ ధనంలో 12 శాతం మాత్రమే డబ్బు వినియోగం అవుతోందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రజలు, రాష్ట్రాల ఆదాయం పడిపోతుందని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంపై పెను ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ కారణంగా పని లేకుండా పోయిన కార్మికుల సమస్యలు దూరం చేయాలని అన్నారు. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాలని ఆయన తెలిపారు. ఇప్పుడు ఏర్పడిన సమస్యల పట్ల భయపడాల్సిన పని లేదని, రాష్ట్రం ప్రజలకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్లలో క్యాష్ లెస్ ట్రాన్షాక్షన్స్ ను జరుపుతామని అన్నారు. గ్యాస్ డెలివరీ, సివిల్ సప్లై, మిల్క్ ప్రొవైడర్స్ దగ్గర స్వైపింగ్ మెషీన్లు పెడతామని చెప్పారు. బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు వాటి ద్వారా లావాదేవీలు నడపేలా, అకౌంట్లు లేని వారికి అకౌంట్లు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. 500 బ్యాంకు శాఖలున్నాయని, వాటిని మరింత పెంచాలని, ప్రతి మూడు గ్రామాలకు ఒక శాఖ, 1500 జనాభాకి ఒక ఏటీఎం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి సూచించామని అన్నారు. దేశంలో 14,500 లక్షల రూపాయల డబ్బుల ప్రవాహం జరుగుతోందని, దానిని అరికట్టాలంటే దేశానికి 10 కోట్ల స్వైపింగ్ మెషీన్లు కావాలన్నారు. టీఎస్ వాలెట్ పేరుతో యాప్ తయారు చేసి అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News