: తెలుగు చిత్రాల్లో హాస్య పాత్రల స్థాయి దిగజారిపోతోంది: హాస్య నటుడు బాబూమోహన్
తెలుగు చిత్రాల్లో హాస్య పాత్రల స్థాయి దిగజారిపోతోందని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హాస్యనటుడు బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కథతో సంబంధంలేని పాత్రలు ఎక్కువ కావడం ఆ పాత్రల స్థాయి దిగజారిపోతోందన్నారు. అప్పట్లో హాస్యపాత్రలకు కథలో తగిన ప్రాధాన్యత, గౌరవం ఉండేవన్నారు. ఇప్పటివరకు 970 సినిమాలలో నటించిన ఆయన తన సినిమా కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. సినిమాల్లోకి వస్తానని తాను ఊహించలేదని, అంకుశం, మామగారు, మాయలోడు చిత్రాలు తనకు ఎనలేని పేరు తెచ్చాపెట్టాయన్నారు. ప్రస్తుతం రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు లభించిందని ఆంథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాబూమోహన్ పేర్కొన్నారు. కాగా, వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాబూ మోహన్ నిన్న కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు వెళ్లారు. తన సన్నిహితుడు పుట్టగుంట సతీష్ కుమార్ నివాసంలో బస చేసిన ఆయన విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు.