: ప్రధాని మోదీ దిగిపోయే వరకు ‘అరగుండు’తోనే ఉంటా!: ఓ చాయ్ వాలా ప్రతిజ్ఞ


‘నా కష్టార్జితాన్ని బూడిదపాలు చేసిన ప్రధాని మోదీ, ఆ పదవి నుంచి దిగిపోయే వరకు నేను అరగుండుతోనే ఉంటాను’ అని పెద్దనోట్ల రద్దుతో నానా బాధలు పడ్డ ఓ చాయ్ వాలా ప్రతిన బూనాడు. పెద్దనోట్ల రద్దు తర్వాత తన బాధలు అన్నీ ఇన్నీ కావని చెబుతున్న యహియా ఆవేదనను, ఆయన ఫొటోలను కేరళ యూనివర్శిటీలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ అప్రాష్ కాదక్కల్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ఈ ఛాయ్ వాలా కథేమిటంటే.. కేరళకు చెందిన డెబ్భై సంవత్సరాల యహియా చిన్నహోటల్, టీ కొట్టు నడుపుకుంటున్నాడు. ఆయన సొంతూరు కొల్లాం జిల్లాలోని కొడక్కల్ ముక్కున్నమ్. యహియాకు భార్య, ఇద్దరు కూతుళ్లు. పెద్దగా చదువుకోని పేద యహియ, తన కుటుంబపోషణ నిమిత్తం కూలి పనులు చేయడమే కాదు, గల్ఫ్ దేశాలకు కూడా వెళ్లాడు. చివరకు, ఒక చిన్న హోటల్, టీ కొట్టు పెట్టుకుని తన సొంత ఊరులోనే స్థిరపడ్డాడు. తన వద్ద ఉన్న డబ్బుకు బ్యాంకు లోన్ ద్వారా వచ్చిన డబ్బులు కలిపి తన కుమార్తె పెళ్లి కూడా చేశాడు. హోటల్ లో అన్ని పనులు తానే చూసుకునే యహియా అందుకు సౌకర్యవంతంగా వుండడం కోసం నైటీ ధరిస్తాడు. ఆయన కష్టపడి రూ.23 వేలు దాచుకున్నాడు. పెద్దనోట్ల రద్దుతో వీటిని మార్చుకోవడం ఆయనకు కష్టమైంది. నోట్ల మార్పిడి నిమిత్తం రెండు రోజుల పాటు బ్యాంక్ కు వెళ్లాడు. రెండో రోజు బ్యాంక్ కు వెళ్లిన సమయంలో క్యూలో నిలబడ్డ యహియాకు బీపీ డౌన్ అవడంతో అక్కడే కూలబడ్డాడు. అక్కడి వాళ్లు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కో-ఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీసుకున్న ఆయనకు, బ్యాంకులో ఖాతా మాత్రం లేదు. దీంతో, తన డబ్బును మార్చుకోవడం కష్టమని భావించిన యహియా, ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లగానే ఆ డబ్బును కాల్చిపారేశాడు. వెంటనే, సమీపంలో ఉన్న బార్బర్ షాపునకు వెళ్లి తన బట్టతలను సగం గుండు చేయించుకున్నాడు. పెద్దనోట్ల రద్దుతో తన కష్టార్జితాన్ని బూడిదపాలు చేసిన ప్రధాని మోదీ, ఆ పదవి నుంచి దిగిపోయే వరకు అరగుండుతోనే ఉంటానని యహియా ప్రతిన బూనాడు.

  • Loading...

More Telugu News