: ఇంత జరుగుతున్నా ప్రధాని ఎక్కడ? ఆయన సమక్షంలోనే చర్చ జరగాలి: లోక్ సభలో కాంగ్రెస్ డిమాండ్
నోట్ల రద్దు అంశంపై పార్లమెంటు ఉభయసభలు నిరసనలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలైన్లలో డబ్బు కోసం వేచి చూస్తున్నారని లోక్ సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించి, చర్చకు స్పీకర్ అనుమతించాలని విన్నవించారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ సభకు రాకుండా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తలెత్తిన ఇబ్బందులకు పరిష్కారాలు చూపాల్సిన ప్రధాన మంత్రి... వాటిని పట్టించుకోకుండా కేవలం విపక్షాలపై విమర్శలు కురిపించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.