: ఓపికతో క్యూలో నిలబడేందుకు దైవ దర్శనమా?: మోదీ సలహాపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
ఓ వైపు బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు లైన్లో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతుంటే, ఓపికగా ఉండాలని వారికి ప్రధాని మోదీ సలహా ఇవ్వడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. ఓపికగా, తమ వంతు వచ్చే వరకూ వేచి చూసేందుకు దైవ దర్శనానికి నిలబడి ఉన్నారా? అని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ చేతగాని తనం వల్ల ఇంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కోరుతుంటే, ఎంతమాత్రమూ స్పందించకుండా, కనీసం పార్లమెంట్ కు కూడా రాకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని నిప్పులు చెరిగారు. కరెన్సీకి కొరతను తెచ్చి, తద్వారా భారత్ బంద్ ను సృష్టించిందే మోదీ అని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజా నిరసన మరింతగా పెరగనుందని, ప్రజల పక్షాన తాము పోరాడుతామని ఖర్గే తెలిపారు. ప్రధాని పార్లమెంట్ లో నల్లధనంపై చర్చకు హాజరు కావాల్సిందేనని, అప్పుడు మాత్రమే తాము చర్చలో పాల్గొంటామని, లేకుంటే చర్చకు అర్థమే ఉండదని ఆయన స్పష్టం చేశారు.