: అఖిలేష్ తో వేగలేను... ప్రతి దానికి ఓ హద్దు ఉంటుంది: ములాయంతో మొరపెట్టుకున్న అమర్ సింగ్


యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్, అతని అనుచరులతో తాను వేగలేనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ తో ఆ పార్టీ అగ్రనేత అమర్ సింగ్ మొరపెట్టుకున్నారు. ప్రతి దానికి ఓ హద్దు ఉంటుందని... అంతకు మించి భరించడం తన వల్ల కావడం లేదని ములాయంతో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఏం చేయాలో చెప్పాలంటూ ములాయంను అడిగారు. ములాయం సింగ్ తో అమర్ సింగ్ ఈ రోజు వ్యక్తిగతంగా భేటీ అయి తన ఆవేదనను వెళ్లగక్కారు. అఖిలేష్ ను బాధించడం తనకు కూడా ఇష్టం ఉండదని... కానీ, తనకు ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయని ములాయంకు ఆయన తెలిపారు. అంతకు ముందు మీడియాతో అమర్ సింగ్ మాట్లాడుతూ, తన సొంత కుమారుడిని కూడా కాదని, ములాయం తనకు మద్దతు ఇచ్చారని చెప్పారు. తన బాధను ములాయంతోనే పంచుకుంటానని... ఆయన ఏది చెబితే అది చేస్తానని తెలిపారు. తాను అఖిలేష్ తో ఉండకపోయినా... ములాయంతో మాత్రం ఎప్పుడూ ఉంటానని చెప్పారు. అయితే, ఎప్పుడూ అఖిలేష్ కు అనుకూలంగానే మాట్లాడతానని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు... ఓవైపు కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ వేగంగా దూసుకుపోతుంటే... మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న సమాజ్ వాదీ మాత్రం ఇంటి పంచాయితీలతో సతమతమవుతోంది.

  • Loading...

More Telugu News