: తెలంగాణలో ఎంతమాత్రమూ కనిపించని భారత్ బంద్... ఏపీలో పలు చోట్ల విజయవంతం
నోట్ల రద్దు తరువాత ప్రజలకు ఏర్పడిన కష్టాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ, కొన్ని రాష్ట్రాల్లో బంద్, మరికొన్ని రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఈ బంద్, నిరసనల ప్రభావం తెలంగాణలో ఎంతమాత్రమూ కనిపించగపోగా, ఏపీలో మాత్రం పలుచోట్ల విజయవంతమైనట్టు తెలుస్తోంది. ఈ ఉదయం నుంచే పలు పట్టణాల్లో వైకాపా శ్రేణులు రోడ్లపైకి వచ్చి బస్సులను అడ్డుకున్నాయి. తిరుపతి, విజయవాడ, కడప, శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో పలువురు వైకాపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే బంద్ ను పాటించగా, కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, హైదరాబాద్ లో ఆర్బీఐ కార్యాలయం వద్ద కాంగ్రెస్ తెలిపిన నిరసన మినహా రాష్ట్రంలో మరెక్కడా బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. బస్సులు యథాతథంగా తిరిగాయి. పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తున్నాయి.