: మిగిలింది రెండు రోజులే... 'ఐడీఎస్' వీరులకు ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక
నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్ (ఇన్ కం డిక్లరేషన్ స్కీమ్)లో భాగంగా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ప్రకటించిన వారంతా నవంబర్ 30లోపు ఆదాయపు పన్ను సెటిల్ మెంట్ చేయాలని ఐటీ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజులు మాత్రమే మిగిలివున్నాయని, ఈ లోగా చెల్లింపులన్నీ పూర్తి చేయకుంటే, తొలుత వెల్లడించిన స్వచ్ఛంద నగదు వివరాలు చెల్లబోవని వాటిని నల్లధనంగా పరిగణించాల్సి వుంటుందని పేర్కొంది. కాగా, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఐడీఎస్ అమలులో ఉండగా, 45 శాతం పన్ను, పెనాల్టీలపై పలువురు తమ నల్లధనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరంతా ఎల్లుండిలోగా, మొత్తం చెల్లించాల్సిన పన్నులో 25 శాతాన్ని ఖజానాకు చేర్చాల్సి వుంది. ఆపై మార్చి 31లోగా మరో 25 శాతం, మిగిలిన మొత్తాన్ని సెప్టెంబర్ 30లోగా కట్టాల్సి వుంటుంది. పన్ను ఇన్ స్టాల్ మెంట్ సరైన సమయంలోగా చెల్లించకుంటే సదరు డిక్లరేషన్ ఇన్ వ్యాలీడ్ అవుతుందని ఆదాయపు పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్కీము కింద మొత్తం 64,275 మంది రూ. 65,250 కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఖజానాకు రూ. 29,362 కోట్ల ఆదాయం లభించనుంది.