: భారత సైన్యం చాలా గొప్పది... ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను మాత్రం వణికిపోయాను: మనోహర్ పారికర్
భారత సైన్యం చాలా గొప్పదని, శత్రు సేనలను వెంటాడటంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తోందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. తాను రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే రోజున భయంతో వణికిపోయానని, తనకు సైన్యంలో ర్యాంకుల గురించిన వివరాలు కూడా తెలియవని చెప్పిన ఆయన, తన ముఖాన్ని గంభీరంగా ఉంచేందుకు ఎంతో ప్రయత్నించానని చెప్పారు. గోవా ముఖ్యమంత్రిగా ఉన్న తనను రక్షణ శాఖకు పిలవడంతో, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలనా? అని భయపడ్డానని ఈ ఉదయం పనాజిలో జరిగిన విజయ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న ఆయన పాత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. కార్గిల్ యుద్ధం సమయంలో నినాదాలు చేశానని, ఇప్పుడు యుద్ధ క్షేత్రమే తన ముందుకు వచ్చిందని చెప్పిన పారికర్, ఎవరైనా దాడి చేస్తే, ఎదురుదాడి చేసే పూర్తి స్వేచ్ఛ సైన్యానికి ఉందని తాను స్పష్టంగా చెప్పానని అన్నారు.