: నేపాల్‌లో భూకంపం... భయంతో పరుగులు తీసిన జనం
నేపాల్‌లో ఈ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.5గా నమోదైంది. ఉదయం 5.05 గంటలకు భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు నేపాల్ సిస్మోలజీ కేంద్రం, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రకటించాయి. కఠ్మాండుకు 150 కిలోమీటర్ల దూరంలోని సోలుకుంబు జిల్లాలోని ఎవరెస్ట్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు తెలిపాయి. భూకంపంతో ఇళ్లు కుదుపునకు గురవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. భూకంపం కారణంగా జరిగిన నష్టంపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు.