: విపక్షాల తలోదారి.. రాష్ట్రాల్లోనూ అదే తీరు.. బంద్ ప్రభావం లేకపోవడానికి అదే కారణమా?
పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన రద్దుపై రాజకీయ పార్టీలు తలోదారి అయ్యాయి. ఫలితంగా బంద్ ప్రభావం నామమాత్రమే అయింది. పెద్దనోట్ల రద్దుపై మూకుమ్మడిగా పోరాడతామని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే ప్రకటన చేసిన నాలుగు రోజులకే మాట తప్పాయి. తలోదారి పట్టాయి. ప్రజలు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారని, బంద్‌తో వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేయలేమని మెజారిటీ పార్టీలు స్పష్టం చేశాయి. భారత్ బంద్‌ను తాము ఆక్రోస్ దివస్‌గా పాటిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. అందులో భాగంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా, అత్యవసర సేవలకు ఏమాత్రం ఆటంకం కలగకుండా నిరసన తెలుపుతామని పేర్కొంది. అసలు తాము బంద్‌కే పిలుపు ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ నిన్న ప్రకటించారు. నోట్ల రద్దుపై తొలినుంచి విరుచుకుపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్‌కు తమ మద్దతు లేదని జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు. అయితే బంద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేయాలని వామపక్ష పార్టీలు మాత్రం పట్టుదలతో ఉన్నాయి. దీంతో బంద్‌కు ముందే విపక్షాలు తలోబాట పట్టాయి. బంద్ విషయంలో అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో బంద్‌లో పాల్గొనాలో, వద్దో పలు పార్టీల కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు. కొందరు కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చినా నిరసనలకే పరిమితమవుతున్నారు. దీంతో బంద్ లక్ష్యం నెరవేరడం లేదు. మరోవైపు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎక్కడా బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. రైళ్లు, బస్సులు, ఆటోలు యథావిధిగా తిరుగుతున్నాయి.