: దేశ విభజనకు ముందు పాక్‌లో ఇస్లాం ప్రమాదంలో ఉంటే.. తర్వాత పాక్ ప్రమాదంలో పడింది: పాక్ రచయిత ఫర్హనాజ్
భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోవడానికి ముందు పాకిస్థాన్‌లో ఇస్లాం మతం ప్రమాదంలో ఉంటే, విభజన తర్వాత మొత్తం పాకిస్థాన్ ప్రమాదంలో పడిందని ప్రముఖ పాక్ రచయిత ఫర్హనాజ్ ఇస్‌పహానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన లిటరరీ ఫెస్టివల్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్‌తో ఆమె ముచ్చటించారు. పలు విషయాలను ఆమె నెమరువేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ దేశాలు రెండూ స్నేహభావంతో మెలగుతాయని పాక్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా భావించేవారని, కానీ నేడు అందుకు విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం, మతం రెండూ కలిసి ముందుకు సాగలేవని జిన్నా అభిప్రాయపడేవారని, అందుకే ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కరాచీ, బలూచిస్థాన్ ప్రజలు తమను తాము రెండోతరగతి పౌరులుగా భావిస్తున్నారని పేర్కొన్న ఫర్హనాజ్ వారి అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం అక్కడి ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.