: దాసరి నారాయణరావు అనే మహానుభావుడి వల్లే రచయితకు ఒక గౌరవం వచ్చింది: తనికెళ్ల భరణి
దాసరి నారాయణరావు అనే మహానుభావుడి వల్లే రచయితకు ఒక గౌరవం వచ్చిందని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,‘దాసరి తీసుకువచ్చిన ఆ గౌరవాన్ని ముందుకు తీసుకు వెళ్లినవాళ్లు పరుచూరి బ్రదర్స్. ఆ గౌరవాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన వాళ్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, పోసాని కృష్ణమురళి, చిన్నికృష్ణ. దర్శకుడికి ఏ స్థాయి రెమ్యూనరేషన్ ఇస్తారో, రచయితను కూడా ఆ స్థాయికి తీసుకువచ్చారు. ఒకప్పటిలా కాకుండా రచయితలను చాలా గౌరవిస్తూ, డబ్బులు ఇస్తున్నారు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే కనుక ఆ రచయితే డైరెక్టర్ అయిపోతున్నాడు. సినిమా పోస్టర్ మీద రైటర్ పేరు ఉండకపోవడమనేది చాలా బాధాకరమైన విషయం. దర్శకుడు రాంగోపాల్ వర్మ అంతటి వాడు ఏమన్నాడంటే.. ‘రైటర్స్ ఆర్ క్రియేటర్స్, వీ ఆర్ రీ క్రియేటర్స్’ అన్నారు. ఒక సినిమాకు దర్శకుడు ఎంత ముఖ్యమో, రచయిత కూడా అంతే ముఖ్యం. దర్శకుడి పేరు పక్కన రచయిత పేరు కూడా ఉండి తీరాలి అనేది నా కోరిక’ అని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.